హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో సహారా బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో, తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బాధితులు తీవ్రంగా విమర్శించారు. గత ఐదేళ్లుగా 13 కోట్ల మంది సహారా బాధితులకు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.
గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది సహారా బాధితులకు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేయాలని శాంతియుతంగా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు పరిష్కార మార్గం చూపడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఖాతాదారునికి రూపాయి కూడా చెల్లిస్తామని హామీలిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత, ఆ హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని బాధితులు విమర్శించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని, దీనివల్ల దేశంలో ఇప్పటివరకు 10 వేలకు పైగా సహారా ఇండియా ఖాతాదారులు మరణించారని, వందలాది మంది ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఎంతోమంది మానసిక వేదనతో గ్రామాల్లో ఖాతాదారుల ఒత్తిడిని తట్టుకోలేక, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు సమర్పించినా, శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినా, చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించిన ఆన్లైన్ పేమెంట్ పోర్టల్ ద్వారా 40 నెలలు గడిచినా, కేవలం 9,200 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించడం జరిగిందని, ఇంకా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఖాతాదారులకు రావాల్సి ఉందని తెలిపారు.
ఈ డబ్బులు రానందున వారి పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం, గృహ నిర్మాణాలు నిలిచిపోయి, జీవితాలు అంధకారంగా మారాయని బాధితులు వాపోయారు. భవిష్యత్తు అవసరాల కోసం ఎన్నో ఆశలతో పొదుపు చేసుకున్న సొమ్మును, సహారా సంస్థ గద్దలాగా మింగేసి, ఖాతాదారులను ముంచేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సమన్వయంతో సహారా ఇండియా ఆస్తులను వేలం వేసి, వచ్చిన డబ్బులను యుద్ధ ప్రాతిపదికన చెల్లించి, బాధితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాలయ్య హెచ్చరించారు.







