దేశవ్యాప్తంగా పెన్షనర్లకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్సీ) క్యాంపెయిన్ 5.0ను ప్రారంభించనుంది. నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలోని సుమారు 2,000 నగరాలు, జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఈసారి 2.30 కోట్ల డిజిటల్ జీవిత ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెన్షన్ నిరంతరాయంగా అందాలంటే పెన్షనర్లు ప్రతి ఏడాది తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. గతంలో ఇందుకోసం బ్యాంకులు లేదా సంబంధిత కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీవన్ ప్రమాణ్ సేవ ద్వారా ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఉంది.
ముఖ గుర్తింపుతో సులభతరం
ఈసారి ముఖ గుర్తింపు విధానంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సదుపాయం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు బ్యాంకులకు వెళ్లే ఇబ్బందిని తగ్గించడం దీని ఉద్దేశం.
ఇంటి నుంచే ఎలా సమర్పించాలి
స్మార్ట్‌ఫోన్‌లో ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ సేవకు సంబంధించిన అవసరమైన యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పెన్షన్‌కు సంబంధించిన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. యాప్‌లో అడిగిన వివరాలను నమోదు చేసి, ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి. ధ్రువీకరణ విజయవంతమైతే డిజిటల్ జీవిత ధ్రువీకరణ పత్రం రూపొందుతుంది. దానికి సంబంధించిన రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి. డిజిటల్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత దాని స్థితిని సంబంధిత పెన్షన్ చెల్లింపు సంస్థ వద్ద నిర్ధారించుకోవడం మంచిది.
బ్యాంకులు, పోస్టల్ శాఖల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో పెన్షన్ చెల్లింపు బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పోస్టల్ శాఖ, రైల్వేలు, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, రక్షణ శాఖకు చెందిన విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆధార్ సంస్థ తదితర విభాగాలు భాగస్వామ్యం కానున్నాయి. మారుమూల ప్రాంతాల్లో నివసించే పెన్షనర్లకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిజిటల్ జీవిత ధ్రువీకరణ పత్రాల సమర్పణతో పాటు పెన్షనర్లకు ఆరోగ్య పరీక్షలు, ఆధార్ వివరాల నవీకరణ వంటి సేవలను కూడా అందించనున్నారు. అవసరమైన చోట వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందించే ఏర్పాట్లు చేస్తారు. సర్టిఫికెట్ సమర్పణలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉంటారు.


