భారత ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో పలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో అనిశ్చితి, ప్రపంచ పెట్టుబడుల పోటీ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల మధ్య మారుతున్న వాణిజ్య సంబంధాలు భారత్కు సవాళ్లుగా మారుతున్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా అమెరికాతో సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపవచ్చని ఆయన అన్నారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు, ఇతర కీలక ముడిసరుకుల ధరలు పెరగడం కూడా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారవచ్చని ఆయన తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి
దేశీయ తయారీ రంగాన్ని విస్తరించడంతో పాటు కీలక వస్తువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆయన సూచించారు. విదేశీ దిగుమతులపై ఆధారపడే ముడిసరుకులు, పారిశ్రామిక లోహాలు, ఎరువులు, ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.
దేశీయ ఉత్పత్తులను పెంచడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడే స్థాయికి పరిశ్రమలను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఇంధన, భూమి వ్యయాలను తగ్గించడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం కీలకమని ఆయన పేర్కొన్నారు.
వ్యూహాత్మక నిల్వలపై దృష్టి
అత్యవసర వస్తువుల సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవాలని నాగేశ్వరన్ సూచించారు. దిగుమతులకు ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి సరఫరా మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

