ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సమస్యలపై మంత్రులకు వినతిపత్రం అందజేశారు.
ముధోల్ నియోజకవర్గ ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయం. వర్షకాలం ముగింపు దశకు చేరుకున్నా, ఎల్నినో ప్రభావంతో ఈ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. చాలావరకు వర్షంపై ఆధారపడిన పంటలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ముధోల్ నియోజకవర్గంలోని 7 మండలాలను, ఒక మున్సిపాలిటీని కరువు ప్రాంతాలుగా ప్రకటించి, అక్కడి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో తాగునీటి అవసరాల కోసం బోర్లు వేయడానికి నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు.
భైంసా పట్టణ కేంద్రంలో ఇప్పటివరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని, అక్కడ స్టే ఆర్డర్ ఉందని, దానిని క్లియర్ చేయించి, నిరుపేదలకు ఇళ్లు మంజూరు అయ్యేలా చూడాలని ఆయన మంత్రులను కోరారు. భైంసా మండలంలోని గుండెగాం గ్రామస్థులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అవార్డు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
మండలంలోని నిఘ్వ గ్రామం, శ్రీ గడ్డన్న వాగు ప్రాజెక్టు ముంపు గ్రామం కావడంతో, అక్కడ సుమారు 300 ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఆ ప్లాట్లను లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. మండలంలోని హల్ద గ్రామంలో కొంతమంది రైతులకు గతంలో సీలింగ్ సర్టిఫికెట్లు ఇచ్చినా, వాటి ప్రకారం పట్టాలు అమలు కాలేదని, పాస్బుక్లు రాలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు.
తానూరు మండలంలోని మొగిలి గ్రామం, హిపనెల్లి, మొగిలితండ, కోలుర్, కోలుర్ తండా, ఝరి బి వాడ్, ఝరి, మహాలింగి, ఇతర మండలాల గ్రామాలలో పంజాబ్ వారు కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉందని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వివరించారు. అమ్మిన భూములకు కూడా ప్రోహిబిషన్ విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గతంలో కలెక్టర్ సైతం వచ్చి విచారణ చేపట్టారని, అటువంటి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారని తెలిపారు. ఈ భూ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన మంత్రులను కోరారు.
ఈ సందర్భంగా మంత్రులు జి. విఠల్ రెడ్డి వినతిని సానుకూలంగా స్వీకరించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, చర్యలు తీసుకుంటామని మంత్రులు భరోసా ఇచ్చినట్లు సమాచారం.












